న్యూ యార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో నవంబరు 26 న మద్యం మత్తులో ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన వ్యక్తి షాకింగ్ ఉదంతం ఇంకా పతాక శీర్షికల్లో నలుగుతూనే ఉంది. ఇది మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ప్యారిస్-ఢిల్లీ సెక్టార్ లో ఇలాగే మందు కొట్టి వచ్చిన వ్యక్తి .. ఓ మహిళకు చెందిన బ్లాంకెట్ పై మూత్ర విసర్జన చేసినట్టు తెలిసింది.
. అయితే తన చర్యకు ఆయన లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పడంతో ఆయనపై చర్య తీసుకోలేదని తెలుస్తోంది. ఎయిరిండియా విమానం-142 లో డిసెంబరు 6 న ఈ ఘటన జరిగింది. విమాన పైలట్ ఈ విషయాన్ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి తెలియజేశారు.
దీంతో ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. ఇతడు విమానంలో ఏ క్లాసులో ప్రయాణించాడన్నది తెలియలేదు. ఈ విమానం ఆ రోజున ఉదయం 9.40 కి ఢిల్లీకి చేరుకుందని, ఈ తాగుబోతు ప్రయాణికుడి దుశ్చర్య గురించి ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారని వెల్లడైంది.
అయితే తన చర్యకు ఈ వ్యక్తి రాతపూర్వకంగా అపాలజీ చెప్పడంతో.. ఆ మహిళా ప్రయాణికురాలు కూడా రాజీకి వచ్చిందని.. దాంతో ఇతడిని వదిలివేశారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మొదట ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా.. పోలీస్ కేసు పెట్టేందుకు నిరాకరించిందట. దీంతో అతగాడు విమానాశ్రయం నుంచి సేఫ్ గా బయటపడ్డాడు. .