కో అంటే కోటి..దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి అంటూ డబ్బెంత పవర్ ఫుల్లో చెప్పే పాటలోని మాటిది. నిజమే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. కాకపోతే ఆ డబ్బుని ఎందుకు ఉపయోగిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో ఖర్చు పెడుతున్నాం. ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేస్తున్నాం అన్నదే విషయం. ఇప్పుడు అసలు పాయింటుకి వద్దాం. ఓ యువతి తప్పతాగి తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ ఆర్డరు పెట్టుకుంది.
కాకపోతే తానున్న రాష్ట్రం నుంచి కాదు పక్క రాష్ట్రం నుంచి. విచిత్రంగా ఉంది కదూ! ఇంకో ట్విస్టేంటంటే ఆమె ఆర్డర్ పెట్టిన బిర్యానీ మత్తు దిగాకా వచ్చింది. అంటే… మరుసటి రోజు వచ్చిందన్న మాట. వచ్చిన బిల్ చూసుకుంది ఆమె బుర్ర గిర్రున తిరిగి మిగిలిన ఆ కాస్త మత్తూ వదిలిపోయింది.
ముంబైకి చెందిన ఓ యువతి ఫుల్‌గా మద్యం సేవించింది. ఫుడ్ ఆర్డర్ కోసం తన ఫోన్ తీసింది. మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన జొమాటోలో బెంగళూరులోని మేఘనా ఫుడ్స్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. దాని ధర ఎంత అనుకుంటున్నారు.. రూ.2500. దీంతో షాకైన యువతి తన ఆర్డర్‌ను చెక్ చేసుకోగా..బెంగళూరు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్టు చూపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
అయితే ఆమెకు తర్వాతి రోజు (జనవరి 22)న ఫుడ్ డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘నేను బెంగళూరు నుంచి రూ.2,500 విలువైన బిర్యానీని ఆర్డర్ చేశానా..?’ అంటూ పోస్టు చేసింది. ఆర్డర్ ప్లేస్‌కు సంబంధించిన పిక్‌ను ట్వీట్‌కు జతచేసింది.
అనంతరం ఫుడ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫొటోలను సైతం పోస్ట్ చేసింది. కాగా, ఈ ట్వీట్‌కు జొమాటో సైతం స్పందించింది.‘ఆర్డర్ మీ ఇంటి వద్దకు చేరాకా.. మీ అనుభవం గురించి తెలియజేయండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.