మళ్ళీ అదే సీన్ రిపీటయింది. ఇటీవల ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరవక ముందే తిరిగి అలాంటి ఉదంతం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ విద్యార్ధి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. దాదాపు 14 గంటలపైగా ఈ విమాన ప్రయాణం సాగగా.. మద్యం తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్న ఈ విద్యార్ధి నిద్రలోనే మూత్ర విసర్జన చేశాడని .. అది కొంత లీకయి పక్కనున్న ప్రయాణికుడిపై పడిందని తెలిసింది.
ఆర్య వోహ్రా అనే విద్యార్థిగా ఇతడిని గుర్తించారు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఇతడు చదువుతున్నట్టు తెలిసింది. ఈ విమానం శనివారం రాత్రి 10.12 గంటలకు ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
నిద్ర లేచిన తరువాత ఆర్య వోహ్రా జరిగినదానికి సదరు ప్రయాణికుడికి క్షమాపణ చెప్పాడు. తనపై సిబ్బందికి ఫిర్యాదు చేయవద్దని, చేసిన పక్షంలో తన కెరీర్ నాశనమవుతుందని అన్నాడట.
ఇందుకు బాధితుడు కూడా అంగీకరించాడు. అయితే విమాన పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియజేశాడు. సెక్యూరిటీ సిబ్బందివచ్చి అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఇతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే అమెరికన్ ఎయిర్ లైన్స్.. దీన్ని సీరియస్ గా పరిగణించి ఇక ఈ విద్యార్థిని తమ విమానాలు ఎక్కనివ్వబోమని హెచ్చరించింది.