హైదరాబాద్ నగర రోడ్లు రక్తదాహంతో అర్రులు చాచినట్లుగా ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఇటీవలి బయో డై వర్శిటీ ఘటన మరవక ముందే మంగళవారం భరత్ నగర్ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనను నగర వాసులు మర్చిపోక ముందే తాజాగా నగర శివార్లలోని మియాపూర్ లో ఓ కారు భీభత్సము సృష్టించింది. వేగంగా ప్రయాణిస్తూ పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో వెళ్తోన్న కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అఫ్జల్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపమాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు కారణమైన వ్యక్తి సంతోష్ మద్యం మత్తులో కారు నడపడం వలెనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై కారు ప్రయాణిస్తోన్న తీరుతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఏదైనా సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా అనేంతలా నిందితుడు కారును డ్రైవ్ చేశాడు.