ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన వ్యక్తి ఆచూకీ తెలిసింది. నవంబరు 26 న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఈ విమానంలో ఈ దుశ్చర్యకు దిగిన వ్యక్తిని శేఖర్ మిశ్రాగా గుర్తించారు. ఈ ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలించారు.
శేఖర్ మిశ్రా అనే ఈ వ్యక్తి ముంబైలో ఉంటాడని, కానీ ప్రస్తుతం ఏదో రాష్ట్రంలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓ పోలీసు బృందం ఆ రాష్ట్రానికి వెళ్లిందని , సాధ్యమైనంత త్వరలో అతడిని అరెస్టు చేస్త్తామని వారు చెప్పారు. ఐపీసీ లోని వివిధ సెక్షన్లతో బాటు విమాన నిబంధనల కింద కూడా అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామన్నారు.
శేఖర్ మిశ్రా మరే విమాన ప్రయాణం చేయకుండా ఎయిరిండియా అతడిపై 30 రోజుల బ్యాన్ విధించింది. విమానంలో నాడు జరిగిన పరిస్థితి పై సిబ్బంది వైఫల్యాలేవైనా ఉన్నాయా అన్న విషయాన్నీ నిర్ధారించేందుకు ఈ సంస్థ ఓ అంతర్గత కమిటీని కూడా నియమించింది.
డీజీసీఎ తో బాటు ఏవియేషన్ రెగ్యులేటర్ కూడా ఈ ఎయిర్ లైన్స్ నుంచి నివేదిక కోరింది. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నారు. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ ఘటనపై ఎయిరిండియా చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ కు లేఖ రాయడమే గాక.. పోలీసులు ఏ తదనంతర చర్య తీసుకున్నారో ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.