నేను కాంగ్రెస్‌లో చేరడంలేదని డి. శ్రీనివాస్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. మాణిక్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వార్తలు వచ్చాయి.
ధర్మపురి శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై డి. శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ లో చేరడం లేదు, నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.
నా కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నారు, సంజయ్ కి నా అభినందనలని తెలిపారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా ఆయనతో పాటు డి శ్రీనివాస్ కూడా గాంధీ భవన్ కు వెళ్లారు. ఆయనకు ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నేతలందరిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.
ఇప్పటికే తన చిన్న కొడుకు అర్వింద్ ఎంపీగా ప్రజాసేవలో ఉన్నాడని చెప్పారు. తన కుమారులు ఎక్కడున్నా వారికి తన ఆశీస్సులుంటాయని తెలిపారు. పార్టీలు వేరైనా తన కుమారులు ప్రజల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు.