కేంద్రం పంపిన నిధులను తమ ఇంటి నుండి ఇస్తున్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేంద్రం ఎన్ఆర్జీఎస్ నుండి రూ. 53 కోట్ల నిధులు మంజూరు చేస్తే.. దుబ్బాక నియోజకవర్గానికి కేవలం 3 కోట్ల నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అది కూడా కేవలం టీఆర్ఎస్ సర్పంచ్ లకే ఇచ్చారని ఆరోపించారు.
కేంద్రం ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధుల ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర నిధుల్లో దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే. తమ నియోజకవర్గానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలలు గడుస్తున్నా సిద్ధిపేట జిల్లాకు కలెక్టర్ లేకపోవడం బాధాకరమన్నారు. కనీసం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే.. అధికారులు ఎవ్వరు కార్యాలయంలో లేరని మండిపడ్డారు. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేని దౌర్బాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు లేనప్పుడు ఆఫీస్ లు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు ఏదైనా ఆపతి వస్తే ఎవరికి చెప్పుకోవాలని అన్నారు. ఉన్నతాధికారులు వచ్చి వినతిపత్రం తీసుకునే దాకా ఇక్కడే నిరసన చేపడుతాయన్నారు రఘునందన్ రావు అన్నారు. ఏ అధికారి ఎలా నివేదిక పంపి నిధులు మంజూరు చేస్తారో మాకు తెలియాలన్నారు.
అధికారులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ నాయకులతో కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు వచ్చే వరకు అక్కడే బైఠాయించారు. చివరకు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తమనియోజకవర్గంలో కేవలం టీఆర్ఎస్ సర్పంచ్ లకు మాత్రమే నిధులు అందించారని.. అన్ని గ్రామాల సర్పంచ్ లకు నిధులు అందేలా చూడాలని కోరారు. లేదంటే మరో యుద్దం తప్పదని కేసీఆర్ ను హెచ్చరించారు రఘునందన్ రావు