సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తతల నడుమ ఆర్టీసీ కొత్త బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బస్టాండ్ ప్రారంభోత్సవంపై ఉదయం నుంచి దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు.
అయితే అప్పటికే బస్టాండ్ దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయటంతో బస్టాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు బస్టాండ్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాల మధ్యనే మంత్రులు బస్టాండ్ ను ప్రారంభించారు.
గతంలో దుబ్బాక ఎన్నికల్లో బస్టాండే టార్గెట్ గా ఎన్నికల ప్రచారం సాగింది. ఇచ్చిన హామీ మేరకే బస్టాండ్ పూర్తి చేశామని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే.. తాను కట్టడటం వల్లే నిర్మాణం త్వరగా పూర్తి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెబుతున్నారు.