తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూలాలు బిహార్ లోనే ఉన్నాయనే అనుమానం కలుగుతోందని విమర్శించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బదిలీలు చేసిన ఐపీఎస్ ల జాబితా ఎన్నికల టీమ్ అని ప్రచారం జరుగుతోందన్నారు.
ట్రాన్స్ ఫర్లలో తెలంగాణ కేడర్ కి చెందిన ఒక్క ఐపీఎస్ కి కూడా మంచి పదవి దక్కలేదన్నారు. బీహార్ కి చెందిన అధికారులకే కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ మూలాలు బిహార్ లోనే ఉన్నాయనే అనుమానం కలుగుతోందని సెటైర్లు వేశారు.
ఏపీ కేడర్ కు చెందిన, ప్రస్తుత తెలంగాణ ఇన్ ఛార్జ్ డీజీపీ అంజనీ కుమార్, తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారే అని పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.
సిద్ధిపేట, సిరిసిల్లలో నా పరపతి ఉందో లేదో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని అన్నారు. తాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, ఆ సమయంలో తనపై విమర్శలు చేసే కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు రఘునందన్ రావు.