దుబ్బాకలో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఒకవేళ ప్రభుత్వం అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ భార్య శోభ దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పలేదా..? అని గుర్తు చేశారాయన. అలాగే 2017లోమూడేళ్లలో దేశంలోనే యాదవులు అత్యంత ధనవంతులు అవుతారని కేసీఆర్ చెప్పారు. మరి.. యాదవులు ధనవంతులు అయ్యారా..? అని ప్రశ్నించారు.
దుబ్బాక వెనకబడిన ప్రాంతం.. కేసీఆర్ చదివిన, పెరిగిన ప్రాంతం.. కాబట్టి ఇక్కడ దళిత బంధు అమలు చేయాలన్నారు రఘునందన్ రావు. హుజూరాబాద్ లో ఈటలను ఎదుర్కోలేక ఈ పథకం పెట్టారని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి దుబ్బాకలో కూడా దళితులకు డబ్బులు ఇవ్వాలని సూచించారు. దళిత సామాజిక వర్గానికి కార్పొరేషన్లతో సరిపెడుతున్నారు.. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారాయన.