ఐపీఎల్-2022లో డకౌట్ల మీద డకౌట్లు నమోదవుతున్నాయి. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఒక రాయల్ డకౌట్, రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు.
మనలో చాలా మంది డకౌట్ అనే పదం గురించి తెలిసే ఉంటుంది. కానీ క్రికెట్ లో రాయల్, డైమండ్, గోల్డెన్ లాంటి పలు రకాల డకౌట్ లు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. వాటి వివరాల్లోకి వెళితే..
డైమండ్ డక్ :
క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఎలాంటి బంతులు ఎదుర్కోకుండానే సున్నా పరుగులకే ఔట్ అయితే దాన్ని డైమండ్ డక్ అంటారు. ఇది రెండు పరిస్థితుల్లో సాధ్యం అవుతుంది.
మొదటిది.. బ్యాటింగ్ కు వచ్చిన వ్యక్తి ఎలాంటి బంతులను ఎదుర్కోకుండా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉండి అవుట్ అయ్యే సందర్భం. రెండో సందర్భం… చివరి బ్యాట్స్ మెన్ బంతులేవి ఆడకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండగానే ఆట ముగిసినప్పుడు. ఆదివారం మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్స్, శనివారం మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లు డైమండ్ డక్ అవుట్ అయ్యారు.
గోల్డెన్ డకౌట్…
క్రీజ్ లో వచ్చిన బ్యాట్స్ మెన్ మొదటి బంతికే డకౌట్ అయితే దాన్ని గోల్డెన్ డకౌట్ అంటారు. ఈ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు.
సిల్వర్ డకౌట్…
బ్యాట్స్ మెన్ రెండవ బంతికి డకౌట్ అయితే దాన్ని సిల్వర్ డకౌట్ అంటారు.
బ్రాంజ్ డకౌట్…
ఎలాంటి పరుగులు చేయకుండానే బ్యాట్స్ మెన్ మూడవ బంతికి ఔట్ అయితే దాన్ని బ్రాంజ్ డకౌట్ అంటారు.
రాయల్ (ప్లాటినమ్) డకౌట్…
రాయల్ ప్లాటినమ్ డకౌట్ అనేది కేవలం ఓపెనర్ కు మాత్రమే వర్తిస్తుంది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మొదటి బంతికే డకౌట్ అయితే దాన్ని రాయల్ డకౌట్ అంటారు. దాన్నే ప్లాటినమ్ డకౌట్ అని కూడా అంటారు.
లాఫింగ్ డకౌట్…
లాఫింగ్ డకౌట్ అనేది చాలా అరుదుగా వినిపించే పదం. మ్యాచ్ లో ఆఖరి ఓవర్ చివరి బంతికి బ్యాట్స్ మెన్ డకౌట్ అయితే దాన్ని లాఫింగ్ డకౌట్ అంటారు.
పెయిర్ డకౌట్….
పెయిర్ డక్ అనేది కేవలం టెస్టు క్రికెట్ కు మాత్రమే వర్తిస్తుంది. ఒక టెస్టు మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ వరుసగా రెండు ఇన్నింగ్స్ లో డకౌట్ అయితే దాన్ని పెయిర్ డకౌట్ అంటారు.
కింగ్ పెయిర్ డకౌట్….
కింగ్ పెయిర్ డకౌట్ అనే పదం కూడా టెస్ట్ క్రికెట్ కే వర్తిస్తుంది. టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ బ్యాట్స్ మెన్ మొదటి బంతికే డకౌట్ అయితే దాన్ని కింగ్ పెయిర్ డకౌట్ అని పిలుస్తారు.
టైటానియం డక్…
డైమండ్, టైటానియం డక్ లు దాదాపు ఒకటే. అయితే ఇన్నింగ్స్‌లో తొలి బంతికే బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండా, ఎలాంటి బంతి ఆడకుండా ఔట్ అయితే దానిని టైటానియం డక్ అంటారు.
గోల్డెన్ గీస్ డక్….
గోల్డెన్ డక్, గోల్డెన్ గీస్ డక్ చిన్న తేడా ఉంది.. కొత్త సీజన్ లో మొదటి మ్యాచ్ లో మొదటి బంతికే డకౌట్ అయితే దాన్ని గోల్డెన్ గీస్ డకౌట్ అంటారు.