– వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
– అన్నదాతకు అపార నష్టం
– కొనుగోళ్లలో జాప్యమే కారణమా?
– రైతన్నలు ఏమంటున్నారు?
రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలకు ఆరుగాలం పండించిన పంట అంతా నీటిపాలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక.. కల్లాల్లో పోసిన ధాన్యం నీటిపాలైంది. అకాల వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయారు. చేతికందిన పంట కళ్లముందే నీటమునుగుతుంటే కంట నీరుపెట్టుకోవడం తప్ప చేసేదేం లేక చూస్తుండిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడుతున్నారు. మౌళిక వసతులు కల్పిస్తే.. కల్లాల్లో పోసిన పంట ఇలా ఎందుకవుతుందని నిలదీస్తున్నారు.
నల్గొండ వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షానికి పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. భారీగా కురిసిన వర్షాలకు హాలియా మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా.. నిడమానూరు మండలం వేంపాడు కొనుగోలు కేంద్రంలో రెండు వేల బస్తాల ధాన్యం తడిసిముద్దైంది. దీంతో బాధిత రైతులు తల పట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో భారీగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మంథని మార్కెట్ యార్డుతో పాటు.. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకూ కాంటా పెట్టలేదని రైతులు వాపోతున్నారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో 20 వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో పెద్దపల్లి మార్కెట్ లో 500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది.
వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. చేతికందొచ్చిన పంట నీట మునగడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని.. సకాలంలో కొనుగోళ్లు జరపడం లేదని వాపోయారు. వర్ధన్నపేట సహా రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో కోత దశలో ఉన్న మామిడి కాయలు రాలిపోయాయి. వరి, మొక్కజొన్న రైతులు అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామంటున్నారు. ఇటు నర్సంపేట వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వరి, మామిడి, మొక్కజొన్న పంటను పూర్తిగా నష్ట పోయామని రైతన్నలు కంటనీరు పెట్టుకుంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
Advertisements
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో చేతికందిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం వర్షపు నీటితో కాలువల వెంట కొట్టుకుపోయింది. ఇల్లందకుంట, కమలాపూర్, వీణవంక మండలాల్లో రోడ్డు పక్కన పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లను అందించటం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షానికి పది మండలాల్లో ధాన్యం రాశులు వరద పాలయ్యాయి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. తీవ్రంగా వీచిన ఈదురు గాలులకు వడ్ల కుప్పలపై కప్పిన కవర్లు సైతం ఎగిరి పోవడంతో వరదనీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయిందని ఓ రైతు గుండెలవిసేలా విలపించాడు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతన్నలు. లేదంటే పెట్టుబడులకు చేసిన అప్పు తీర్చలేక చివరకు తమకు చావే దిక్కు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.