కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లో దిగ్విజయంగా యాత్ర ముగించుకుని హర్యానాలోకి అడుగుపెట్టింది. చల్లని వాతావరణంలో వడివడిగా సాగుతున్న యాత్ర పలు విశేషాలకు వేదికగా మారింది. జోడో యాత్రలో ఓ వ్యక్తి రాక వినోదానికి తావిచ్చింది. ఆ సందడి మరెవరిదో కాదు రాహుల్ డూప్ ది. అచ్చం రాహుల్ లా ఉన్న వ్యక్తి యాత్రలో కనిపించడంతో జనం నోరెళ్లబెట్టారు. మీరట్ కు చెందిన ఫైజల్ చౌదరి.. ఘజియాబాద్ లో జోడో యాత్రలో కనిపించాడు.
అచ్చం రాహుల్ మాదిరి టీషర్ట్ ధరించి పెరిగిన గడ్డంతో దర్శనమివ్వడంతో చూసినవాళ్ళంతా రాహుల్ గాంధీయే అని భ్రమించారు. తీరా దగ్గరగా చూశాక డూప్ రాహుల్ అంటూ నవ్వుకున్నారు. కొందరేమో ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇంకొందరేమో షేక్ హ్యాండిచ్చి సంబరపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ‘నేను రాహుల్ గాంధీని కాదు. ఆయనలా కనిపిస్తున్న ఫైజల్ చౌదరిని’ అంటూ చెప్పడం వినిపించింది.
తండ్రి నుంచి కాంగ్రెస్ మూలాలను వారసత్వంగా తీసుకున్న ఫైజల్ చౌదరి.. వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నాడు. స్నేహితులంతా తనను రాహుల్ గాంధీ అని పిలుస్తారని, ఆయన అంటే ఎంతో గౌరవం ఉన్నందున జోడో యాత్రలో పాల్గొన్నట్లు ఫైజల్ చెప్పాడు.
ఆయన మాదిరిగానే గడ్డం పెంచి టీషర్ట్ ధరించి యాత్రలో నడుస్తున్నానని పేర్కొన్నాడు. చాలామంది రాహుల్ అని భావించి తనతో కరచాలనం చేశారని, కొందరు కాళ్లు కూడా మొక్కారని తెలిపాడు. తనను పెద్ద మనిషితో ప్రజలు పోల్చుకోవడం చాలా బాగుందని, బాగా ఆనందిస్తున్నానన్నాడు.