తనను తాను గాడ్ గా ప్రకటించుకున్న స్వామి నిత్యానంద నేతృత్వంలోని ‘కైలాస’తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా.. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ సిటీ రద్దు చేసుకుంది. అమెరికా తమ దేశాన్ని గుర్తించిందంటూ ‘కైలాస’ ప్రకటించుకుందని, కానీ ఈ దేశానికి సంబంధించిన వివరాలు, దీని చుట్టూ ముసురుకున్న పరిస్థితుల గురించి తెలిసిన తరువాత తక్షణమే తామీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని ఈ సిటీ కౌన్సిల్ ప్రెస్ సెక్రటరీ సుశాన్ గారోఫాలో వెల్లడించారు.
గత జనవరి 18 న కుదిరిన ఈ ఒప్పందం ఇక చెల్లదు అని ఆమె స్పష్టం చేశారు. ఈ అగ్రిమెంట్ రద్దయిందని తెలిసిన తరువాత కూడా తన వెబ్ సైట్ లో కైలాస .. ‘గవర్నమెంట్ ఆఫ్ కైలాస’ అని పేర్కొంటోందని, నెవార్క్ సిటీతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నందున అమెరికా ప్రభుత్వం తమను దేశంగా గుర్తించిందని చెప్పుకుంటోందని ఆమె అన్నారు.
కొన్ని గ్రూపులు మున్సిపల్, రాష్ట్ర సంస్థల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. నిత్యానంద చెప్పుకుంటున్న ‘దేశం’ అన్నది తప్పుడు ప్రచారంలో భాగమని, 2019 లో అత్యాచారం, కిడ్నాప్ వంటి నేరాలకు పాల్పడి ఇండియా నుంచి పారిపోయిన ఆయన వైనం తెలిసిందని సుశాన్ పేర్కొన్నారు.
గత జనవరిలో నెవార్క్ సిటీ మేయర్ రాస్ బారాక ,ఇతర సిటీ ప్రముఖుల సమక్షంలో ‘కైలాస’ ఈ కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అది ఏ ఒప్పందమన్నది స్పష్టం కాలేదు.