కల్తీ అనే పేరు చెబితే చాలు వినియోగదారులు హడలి పోతున్నారు. జడ్చర్ల పట్టణంలో రోజు ఏదో ఒక మూల వ్యాపారాల పేరిట కేటుగాళ్లు అసలు సరుకును తలపించేలా నకిలీ సరుకులను దిగుమతి చేసుకొని.. సగటు వినియోగదారుడిని మోసం చేస్తూ తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
స్థానిక పోలీసుల నిఘా కరువవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి వాటిని స్వాధీన పరుచుకున్న ఘటనలు ఇటీవల నిత్యం చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మమతా నగర్ కాలనీలో మహమ్మద్ అలీమ్ పాషా అనే వ్యక్తి ఇంట్లో నకిలీ టీ పౌడర్ బ్యాగులు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది.
ఈ దాడులలో నిల్వ ఉంచిన 14 బ్యాగులలో సుమారు 500 కేజీలకు పైగా నకిలీ చాయ్ పత్తా పట్టుబడడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యాపారి ఆలీం పాషా పై కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా పట్టుబడ్డ నకిలీ చాయ్ పత్తా విలువ సుమారు 65 వేల వరకు విలువ ఉంటుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణంలో ఇటీవల కల్తీలకు జడ్చర్ల పట్టణం కేరాఫ్ గా మారడంతో స్థానిక పోలీసుల నిఘా కూడా కరువవడంతో కల్తీ కేటగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని పట్టణవాసులు చెబుతున్నారు.