పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వలో దువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు పేల్చుతున్న క్రమంలో.. అందులోని తారాజువ్వ పడడంతో ఆలయ పందిరి పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
అయితే సీతారాముల కల్యాణం జరుగుతుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలు ఎక్కడ వ్యాప్తిస్తాయోనన్న భయానికి గురయ్యారు.
అయితే భక్తుల కోసం దేవాలయం ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేడుకలు జరుగుతున్న సమయంలో ఉత్సవాల నిర్వాహకులు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ తారాజువ్వ చలువ పందిళ్లపై పడింది. దీంతో ఒక్కసారిగా మంట అంటుకుంది. క్షణాల్లోనే చలువ పందిళ్లకు మంట పాకి.. భారీగా మంటలు ఎగసి పడ్డాయి.
అయితే మంటలు చెలరేగడంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఇక సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతున్న క్రమంలో స్థానికులు, భక్తులే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే శ్రీరామనవమి వేడుకల్లో ఏదో అపచారం జరగడంతోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. భక్తులు,స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.