విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఆగస్టు 20న ప్రగతి భవన్‌ను ముట్టడించాలని నిర్ణయించాయి. ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం అన్ని అవాస్తవాలు చెబుతోందని, పదే పదే 50 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చెప్తూ అధికార పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. బిశ్వాల్ కమిటీ అంచనా ప్రకారమే లక్షా 91 వేల ఉద్యోగాలు ఉన్నాయని కానీ ప్రభుత్వం.. మాట మారుస్తోందని మండిపడ్డాయి. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు కోట్ల రూపాయలు వసూలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఫిర్యాదులు చేసినా కనీసం చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆరోపించాయి. ఇక రూ. 3 వేల కోట్లకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నా.. చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందిపెడుతోందని విద్యార్థి సంఘాలు విమర్శించాయి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న ప్రగతి భవన్ ముట్టడించబోతున్నామని… రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చాయి.