ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) నేతలు నినదించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమంలో అగ్రభాగాన ఉండి కొట్లాడిన నిరుద్యోగ యువతకు స్వరాష్ట్రంలో నిరాశే మిగిలిందన్నారు.
ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా కూడా ఆ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిరుద్యోగ యవత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. టీఎస్పీఎస్సీ మూడేళ్ల నుంచి నిద్రావస్థలో ఉందని విమర్శించారు.
ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం.. అవిగో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేస్తుందే తప్ప నోటిఫికేషన్స్ మాత్రం ఇవ్వట్లేదన్నారు నేతలు. తక్షణమే 1,91,126 ఉద్యోగాల భర్తీకై ఒకేసారి నోటిఫికేషన్స్ వేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రావా?, ఖాళీ పోస్టులన్నింటికీఒకేసారి జంబో నోటిఫికేషన్ ఇవ్వాలి, ఉత్సవ విగ్రహంగా టీఎస్పీఎస్సీని మార్చడం సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే.. పోలీసులు డీవైఎఫ్ఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.