అల్లరి చేసే వయసు, ఆడుతూ పాడుతూ తిరిగే మనస్తత్వం. కానీ.. ఆ వయసులోనే ఓ పదేళ్ల బుడ్డోడు ఒక కొత్త యాప్ ని తయారు చేశాడు. బెంగళూరుకు చెందిన కనిష్కర్ అనే పదేళ్ల బాలుడు తన తండ్రి పడుతున్న ఇబ్బందిని చూసి ఓ యాప్ ని సృష్టించాడు. కనిష్కర్ తండ్రి ఓ లాయర్. అతను కేసుకు సంబంధించిన ఫైళ్లు తరచూ మిస్ అవడం వలన కొన్ని కేసుల్లో ఇబ్బందులు తలెత్తాయి. వీటిని దగ్గరుండి చూసిన కనిష్కర్ ఏదైనా పరిష్కారాన్ని కనిపెట్టాలి అనుకున్నాడు.
అప్పటికే కోడింగ్ పై ఒక అవగాహన ఉన్న ఆ బుడ్డోడు డాక్యుమెంట్ రూపంలో ఫైళ్లను భద్రపరచుకునేలా ఓ యాప్ ని సృష్టించాలి అనుకున్నాడు. దానిపైన కొంత సమయం కేటాయించి అనుకున్నదాన్ని సాధించాడు. మొదట ఇది చిన్న యాప్ గా రూపకల్పన చెందినప్పటికీ.. దీనికి విశేషమైన ఆదరణ దక్కడంతో వైట్ హ్యాట్ అనే సంస్థ ఆ పిల్లోడిని ప్రోత్సహించింది. దీంతో ఈ యాప్ ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాడు.
ఈ- అటార్నీ అనే యాప్ ద్వారా లాయర్లు తమ క్లయింట్లకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, కేసు వివరాలను సేకరించి పొందుపరుచుకోవచ్చు. ఈ యాప్‌కు తమ క్లయింట్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారనే వారితో మాట్లాడొచ్చు . ‘ఈ-అటార్నీ’ యాప్‌లో సమాచారం లీక్ అయ్యే అవకాశమే లేదని కనిష్కర్ చెప్పాడు.
ఈ యాప్ రూపొందించినందుకు ప్రోత్సాహకంగా తనకు పాఠశాల యాజమాన్యం స్కాలర్షిప్ అందిస్తోందన్నాడు కనిష్కర్. ‘ఆన్లైన్ సొల్యూషన్’ అనే సంస్థ సాయంతో ఈ యాప్‌కు మరింత సాంకేతికత ఉపయోగించి పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.