అతను డబ్బుకి పేదవాడు కానీ, నీతికి మాత్రం కాదు. వయసు మీద పడుతున్నా ఒళ్ళు హూనం చేసుకుంటూ ఈ-రిక్షా నడిపి సంపాదిస్తేగానీ పూటగడవని ఆర్థిక పరిస్థితి ఆయనది. అతని ఆర్థిక స్థితి ప్రతి రోజూ కళ్ళముందు కనబడుతూనే ఉంటుంది…అయితే ఈ నేపథ్యంలో పాతిక లక్షల సొమ్ము అతిథిగా వచ్చి ఆయన్ను పలకరించింది. కానీ అతను ఏ మాత్రం చలించలేదు. పరుల సొమ్ము పాములాగే భావించాడు.
మోదీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిద్వాయ్ నగర్ నివాసి మహమ్మద్ అనే ఈ-రిక్షా డ్రైవర్ రోజూలాగే తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా టిబ్రారోడ్డు సమీపంలోని చెరువుకట్టపై పడి ఉన్న ఒక బ్యాగును చూశాడు. బ్యాగులో ఏముందోనని చూశాడు.
అందులో కనిపించిన డబ్బు చూసిన తొలుత ఒకింత షాక్ గురయ్యాడు..ఆ తర్వాత తన స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. అనంతరం వారిద్దరూ కలసి ఈ బ్యాగును తీసుకెళ్లి మోదీ నగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో 25 లక్షల రూపాయల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.
ఇంత పెద్ద మొత్తంలో బ్యాగ్‌ని డెలివరీ చేసిన డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుంటూ ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ ప్రశంసా పత్రంతో సత్కరించారు.డ్రైవర్ మహ్మద్ మాట్లాడుతూ.. ఈ బ్యాగ్‌ని మొదట గమనించినప్పుడు ఎవరో బాంబు పెట్టినట్లు అనుమానం వచ్చిందని.. కానీ, దాన్ని తెరిచి చూడగా అందులో డబ్బు కనిపించిందని చెప్పాడు.
వెంటనే బ్యాగ్ యజమాని కోసం వెతికే ప్రయత్నం చేశామన్నాడు. కానీ, ఎవరూ కనిపించలేదని.. ప్రయాణికులను ఆటోలో వదిలేసి నా స్నేహితుడి వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇద్దామని అడిగాను…దాని ప్రకారం పోలీసులకు అప్పగించాం.. నేను పేద కుటుంబానికి చెందిన వాడిని..డబ్బు విలువ నాకు తెలుసు..ఆ బాధ కూడా నాకు అర్థం చేసుకోగలనని చెప్పాడు.
అయితే, ఇంతపెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన వ్యక్తులు ఎవరో మాత్రం తెలియలేదని సమాచారం. బ్యాగుకు సంబంధించిన వ్యక్తులేవరూ పోలీసులను సంప్రదించలేదు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
ఆదాయపు పన్ను శాఖను పక్క దారిపట్టించేందుకే ఎవరో కావాలనే డబ్బు వదిలేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా చోట్ల ప్రయాణికులు తమ వాహనంలో మరిచిపోయిన డబ్బు, బంగారు ఆభరణాలు ఇచ్చి నిజాయితీని ప్రదర్శించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
జనవరి 25న షిమోగాలో నాగరాజ్ అనే ఆటో డ్రైవర్ 8 వేల రూపాయలకు పైగా ఉన్న బ్యాగును పోలీసులకు అప్పగించాడు. జనవరి 12వ తేదీన బెంగళూరులో అమెరికా పౌరుడికి సంబంధించిన పాస్‌పోర్టు, వీసా ఉన్న పర్సును ఆటోడ్రైవర్ కిషోర్ పోలీసుల ద్వారా యజమానులకు తిరిగి ఇచ్చాడు.
#PoliceCommissionerateGhaziabad
सड़क किनारे मिले पैसो से भरे बैग को पुलिस को सौप कर ईमानदारी की मिसाल पेश करने वाले ई रिक्शा चालक को डीसीपी ग्रामीण द्वारा किया गया सम्मानित pic.twitter.com/uyOQVcn6cB— DCP RURAL COMMISSIONERATE GHAZIABAD (@DCPRuralGZB) February 7, 2023