డిజిటల్ ఎకానామీ గొడుగు కింద ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ విభాగాలు దేశ ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా.. ఈ–గేమింగ్ పరిశ్రమకు భారీ స్థాయిలో విధానపరమైన మార్గదర్శకాలు, డిజిటల్ ఇన్‌ఫ్రా అవసరమని ఏఐజీఎఫ్ ప్రెసిడెంట్ పి.కె. మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ ప్లేయర్లు అంతర్జాతీ యంగా కూడా గుర్తింపు పొందుతున్నారని వెల్లడించారు.
దేశీయంగా గేమింగ్ మార్కెట్ 2025 నాటికి 6–7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందని వివరించారు. ప్రస్తుతం ఇది 1.8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. ‘భారత్ లో 200 పైగా ప్లాట్‌ఫామ్స్‌లో 20 కోట్ల మంది పైగా ఈ–గేమర్లు ఉన్నారని పేర్కొన్నారు. .
డిజిటల్ ఎకానమీలో భాగంగా ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ విభాగాలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవని.. ఆన్‌లైన్ గేమింగ్ ను నిషేధించాలన్న ప్రతిపాదనలను కొన్ని హైకోర్టులు తోసిపుచ్చాయని ఏఐజీఎఫ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగు మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది.
2022 సెప్టెంబర్ లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో తొలిసారిగా ఈ–స్పోర్ట్స్ కేటగిరీని కూడా అధికారికంగా చేర్చినట్లు ఏఐజీఎఫ్ వివరించింది. కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో భారత్ కూడా చేరబోతోందని మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు.