మంత్రి కేటీఆర్ వరుసగా జిల్లాల బాట పట్టారు. ఏదో ఒక కార్యక్రమంతో ఓవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇంకోవైపు ప్రజల్లో పార్టీ మైలేజ్ ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. సోమవారం మెదక్ లో పర్యటించారు. అలాగే, హన్మకొండ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. నిజామాబాద్ లో ముందస్తు అరెస్టులు చేసినా కాంగ్రెస్ నాయకులు కాన్వాయ్ ని అడ్డుకోవడంతో తర్వాతి పర్యటనల్లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
మంగళవారం కేటీఆర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కేటీఆర్ మీటింగ్ కు అంతరాయం కలిగిస్తారనే అనుమానంతో బీజేపీ నాయకుడు, చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, దళితబంధు సమన్వయ కమిటీ చైర్మన్ కొత్తూరి రమేష్, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు సహా పలువురు నేతల్ని.. హుజూరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ముందస్తుగానే అజ్ఞాతంలోకి వెళ్లారు. అరెస్టులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను 24 గంటల ముందుగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పోలీసుల రాజ్యం చేశారని ఫైరయ్యారు. అధికార పార్టీ నేతలు పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జరిగిన నిర్మాణాలకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని ఆరోపించారు ఈటల.
ఈ అరెస్టులపై ఇకతర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. 48 గంటల ముందస్తు అరెస్టులను ఎన్నడూ చూడలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలు అంటే ఎందుకు అంత భయమని, వారికి ఎలాంటి హాని కలిగినా కేసీఆర్, కేటీఆర్ లదే బాధ్యత అని హెచ్చరించారు.