ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తే కాదు.. ఇప్పుడు ముందస్తు అరెస్టులు కూడా తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ జిల్లాల పర్యటనల నేపథ్యంలో ముందస్తుగా ప్రతిపక్షాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు సీఎం,మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని ప్రతిపక్షాలు వెల్లడించడంతో బందోబస్తులో భాగంగా ముందస్తు అరెస్టులు పోలీసులకు తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇవాళ మంత్రి హరీష్ రావు పర్యటన ఉండడంతో పోలీసులు అర్థరాత్రి నుంచే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. అంతకుముందు మంత్రి పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్, బీఎస్పీ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉట్నూర్ లో తుడుందెబ్బ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
ఇక బోథ్ నియోజక వర్గానికి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా హరీష్ రావుకి ప్రశ్నలు సంధిస్తున్నారు గ్రామస్తులు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బోథ్ లో అడుగుపెట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎస్టీ జాబితాలో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేశాకే జిల్లాకి రావాలని తుడుందెబ్బ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మంత్రి హరీష్ రావు ఇవాళ నిర్మల్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించి, మెడికల్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. దాంతో పాటు బోథ్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. మరో వైపు ఈ విధంగా ముందస్తు అరెస్ట్ లు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.