ఇంకో ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్ వరకు గతంలో మాదిరిగా సీఎం కేసీఆర్ మళ్లీ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసే ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని చులకనగా మాట్లాడితే సహించలేదని మండిపడ్డారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా గురించి తనకు ఎవరూ సమచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజుకు, నిరుద్యోగ సమస్యకు సంబంధం లేదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ని అయినప్పటికీ అన్ని విషయాలు చెప్పి చేయాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీ.. దేశ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగాల కల్పన విషయంలో యువతకు మొండి చెయ్యి చూపించిందని ఆరోపించారు.
ప్రస్తుతం తాను నియోజకవర్గంపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నానన్నారు, అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎన్ని ఫ్రంట్ లు ఏర్పడినా.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా అధికారం చేపట్టడం కుదరదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.