– తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు బడ్జెట్ లు దేనికి సంకేతం
– ఎన్నికలు కూడా ముందస్తున జరుగనున్నాయా?
– ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్
– ఏపీ బడ్జెట్ కూడా అదే నెలలోనే ఉండే ఛాన్స్
– కేసీఆర్, జగన్ మధ్య బంధం కొనసాగుతోందా?
– పరస్పర అవగాహనతోనే ఇద్దరూ ముందుకెళ్తున్నారా?
– రాజకీయ పండితులు ఏమంటున్నారు?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు కొత్తేం కాదు. గత పర్యాయం ఆయన ముందస్తు ఎన్నికలకే వెళ్లి విజయం సాధించారు. దానికి ఆయన చెప్పిన కారణం.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, ఇతర పనులు మధ్యలో ఉన్నాయని.. వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న కారణంగా ముందస్తుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అయితే.. ఈసారి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే.. ఏకంగా ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు కన్ఫామ్ అని బాంబ్ పేల్చారు. అసెంబ్లీ ప్రారంభోత్సవం.. పథకాల్లో పెరిగిన స్పీడప్.. కలెక్టరేట్ల ఓపెనింగ్స్.. ఇలా ప్రభుత్వ దూకుడును గమనించి ఆయనలా అంచనా వేశారు.
దీనికితోడు బడ్జెట్ సమావేశాలు కూడా ముందుకు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ, కేసీఆర్ ఈసారి మరీ ముందుకు వచ్చేశారు. ఫిబ్రవరి మొదట్లోనే సమావేశాలకు ప్లాన్ చేశారు. దీంతో రేవంత్ అనుమానమే నిజమౌతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే.. కేసీఆర్ బాటలోనే వైసీపీ అధినేత జగన్ కూడా నడుస్తున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా ముందస్తు బడ్జెట్ సమావేశాలు జరనున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ బడ్దెట్ సమావేశాలు కూడా ఫిబ్రవరిలోనే జరగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మార్చి మొదటి వారంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికి ముందు వారం రోజులు చాలా బిజీగా ఉంటారు. జీ20 సన్నాహాక సదస్సు విశాఖలోనే జరగాల్సి ఉంది. ఇది కేంద్రం నిర్వహిస్తున్నప్పటికీ.. ఏపీలో జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే మార్చిలో రెండు అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ మధ్యలో నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఈ కారణం చూపించి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలోనే ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణ సర్కార్ కు ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల పనులు లేకపోయినా ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం ముందస్తుకు వెళ్లబోతోందని అందుకే అన్ని పనులు పూర్తి చేసుకుంటోందని ప్రచారం జరుగుతున్నా.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఖండించడం లేదు. సైలెంట్ గా పని చేసుకుంటున్నారు నేతలు. నియోజకవర్గాలకే పరిమితం అయి ప్రజల్లోనే ఉంటున్నారు. కేసీఆర్, జగన్ మొదటి నుంచి ఓ రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అలాగే.. కలిసే ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ను ఇరు ప్రభుత్వాలు ఫిబ్రవరిలోనే పెడుతున్నాయంటే.. కలిసే అసెంబ్లీలను రద్దు చేస్తారా? ఎన్నికలకు వెళ్తారా? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.