నవీన్ కుమార్ రెడ్డి.. శ్రీవారి భక్తుడు
తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు. శ్రీవారి సన్నిధి నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం. తిరుమల ఆలయంలో అనాదిగా జరుగుతున్న ఆర్జిత సేవలను కరోనా సాకుతో ఒక్కొక్కటిగా తాత్కాలికంగా రద్దు చేస్తూ సామాన్య భక్తుల దర్శనానికి అధిక సమయం కేటాయిస్తామని టీటీడీ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. శ్రీవారి సామాన్య భక్తులపై టీటీడీ ధర్మకర్తల మండలికి అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలి. అంతేకాకుండా ఆ సమయంలో మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించాలి.
శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవల తాత్కాలిక రద్దుపై తిరుమల ఆలయ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందుకు టీటీడీ అధికారులను ప్రశ్నించడం లేదు. టీటీడీ ధర్మకర్తల మండలి అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ ఆగమ సలహా మండలి నియామకం ఏమైంది..? అసలు ఉందా..? లేదా..?
తిరుమల దేవస్థానం శ్రీవారి భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదన్న విషయాన్ని టీటీడీ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.
తిరుమలలో ఆర్జిత సేవల తాత్కాలిక రద్దుపై టీటీడీ తాత్కాలిక పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధానార్చకులు సమర్ధిస్తున్నారా..? లేక వ్యతిరేకిస్తున్నారా..? అన్నదానిపై శ్రీవారి భక్తులకు తెలిసేలా స్పష్టమైన ప్రకటన చేయాలి. శ్రీవారి సన్నిధిలో ప్రతి నిత్యం, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే సుమారు 450 ఉత్సవాలను యధావిధిగా కొనసాగించాలని శ్రీవారి భక్తునిగా డిమాండ్ చేస్తున్నాను.