ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అయితే.. ప్రకంపనలు స్వల్పంగా ఉన్నందున, ప్రజలు దానిని గుర్తించలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5:03 గంటలకు భూకంపం సంభవించినట్టు తెలిపారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు మేల్కొని ఉండటంతో ప్రాణ నష్టాలు ఏం జరగలేదని తెలిపారు.
కానీ.. కొన్ని చోట్ల భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారని తెలిపారు. ప్రస్తుతం భూకంప కేంద్రం ఎక్కడుందో తెలియరాలేదని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత ఆదివారం ఉదయం 11.27 గంటలకు 4.1 తీవ్రతో భూమి కంపించిట్టు తెలిపారు అధికారులు. అంతకుముందు ఫిబ్రవరి 5న కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు పెర్కొన్నారు.
ఈనెల 10న జమ్ముకశ్మీర్ సహా ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరాఖండ్ లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయన్నారు. రిక్టర్ స్కేలుపై 7.0, అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపం సాధారణం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణించడం జరుగుతుందని అధికారులుల చెప్తున్నారు. ఈ స్థాయిలో 2.0, అంతకంటే తక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మైక్రో భూకంపంగా పేర్కొంటారని చెప్తున్నారు.