టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్లల్లో ఆస్తినష్టం జరిగింది. ఈ భూకంపాలను చూసిన తర్వాత తమ దేశం సురక్షితమేనా అని పలు దేశాల ప్రజల ఆందోళనలు చెందుతున్నారు.
ఇక భారత్ విషయానికి వస్తే దేశంలో తరుచూ భూకంపాలు వస్తుంటాయి. దేశంలో 59 శాతం భూమిలో తరుచూ ఏదో ఒక కారణంగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణాదితో పోల్చినప్పుడు ఉత్తరాదిలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి.
మరోవైపు దేశాన్ని నాలుగు సిస్మిక్ జోన్‌లుగా వర్గీకరించామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గతంలో చెప్పారు. మొదటి నాలుగ ప్రాంతాల కన్నా ఐదవ జోన్ లో అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయన్నారు.
దేశం వైశాల్యంలో దాదాపు 11 శాతం భూభాగం జోన్ 5లో, 18శాతం జోన్ 4లో, 30% జోన్ 3లో మిగిలినవి జోన్ 2లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తర భారత్‌లోని హిమాయాల్లో ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
1934లో బీహార్-నేపాల్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 8.2గా నమోదైంది. ఈ ప్రమాదంలో సుమారు పది వేల మంది మరణించారు. ఆ తర్వాత ఉత్తర కాశీలో 1991లో సంభవించిన భూకంపంలో 800 మంది మరణించారు.
2005లో కాశ్మీర్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా 80,000 మంది మరణించారు. 2016లో చేసిన అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం… మధ్య హిమాలయాల ప్రాంతంలో టెక్టోనిక్ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇండో-ఆస్ట్రేలియన్, ఆసియా టెక్టోనిక్ ప్లేట్ల కలయిక భాగంలో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గడిచిన 50 ఏండ్లలో హిమాలయాల్లో భారీ భూకంపం రాలేదన్నారు. కానీ భూమి లోపల పలకలు కదులుతూనే ఉన్నాయన్నారు. దీంతో భూమి అంతర్బాగం లో ఏర్పడిన పీడనం బయటకు రాకుండా లోపలే ఉంటోంది. దీంతో రాబోయే పదేండ్లలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని భూకంప పరిశోధనా కేంద్రం చీఫ్ సైంటిస్ట్ పూర్ణ చంద్రరావు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్,మణిపూర్, అస్సాం, జమ్మూ అండ్ కశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్, నాగాలాండ్ ప్రాంతాలు జోన్ 5లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూకంపాలు ఏ క్షణానైనా సంభవించవచ్చని నేషనల్ సిస్మోలజీ సెంటర్ హెచ్చరిస్తోంది. దేశ రాజధాని ప్రాంతం కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా భావిస్తున్నారు.