ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ విషయంలో రష్యా మాట తప్పింది. ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంపై క్షిపణి దాడులకు దిగింది. 36 గంటల పాటు దాడులను ఆపాలని రష్యా సైన్యాన్ని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినప్పటికీ దాడులు ఆగలేదు. తూర్పు ఉక్రెయిన్ నగరాలపై రష్యన్ సైన్యాలు దాడులకు దిగాయి.
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమై క్రమాటోర్స్క్‌పై రష్యస్ సేనలు దాడి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్ష పరిపాలన డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో తెలిపారు. క్రమాటోర్క్స్ నగరంపై రెండుసార్లు ఆక్రమణ దారులు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఒక నివాస భవనం దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.
ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యన్ సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణకు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో దాడులకు దిగవద్దని గురువారం పేర్కొన్నారు. కానీ ఆ ఆదేశాలను రష్యా దళాలు ఉల్లంఘించాయి.
దక్షిణ నగరమైన ఖేర్సన్‌పై మాస్కో బలగాలు దాడి చేశాయని, ఆ దాడుల నేపథ్యంలో చాలా మంది మరణించారని, పలువురికి గాయాలయ్యాయని కైరిలో టిమోషెంకో వెల్లడించారు. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయన్నారు. బాధితులను రక్షించేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు.
మరోవైపు ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. ఏకపక్ష కాల్పుల విరమణను తాము గౌరవిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. తాము ఎలాంటి దాడులు చేయడం లేదని పేర్కొంది. ఉక్రెయిన్ దళాలే దాడులను కొనసాగిస్తున్నాయని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. రెండు దేశాలు ఆర్థడాక్స్ క్రిస్మస్‌ను జరుపుకుంటాయన్నారు.
కాల్పుల విరమణ ప్రకటించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, రష్యా ఆధ్యాత్మిక నాయకుడు పాట్రియార్క్ కిరిల్, పుతిన్ మద్దతుదారు పుతిన్‌కు సూచించారు. దీంతో కాల్పుల విరమణ ఆదేశాలను రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
మరోవైపు ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మిలిటరీ, మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు మొత్తం 24.9 బిలియన్ డాలర్ల సహాయాన్ని అమెరికా అందించింది.
తాజా మిలటరీ సహాయంలో 50 బ్రాడ్లీ సాయుధ వాహనాలు, 100 ఎమ్113 సాయుధ వాహనాలు, 500 టీఓడబ్ల్యూ యాంటీ ట్యాంక్ క్షిపణులు, 55 ఎమ్ఆర్ఏపీ వెహికల్స్, 138 హెచ్ఎమ్ఎమ్వీ వెహికల్స్, 15మిమీ హావిట్జర్లు 18, 105మిమీ టోవ్డ్ హావిట్జర్లు 36 ఉన్నాయి.
వీటితో పాటు 18 మందుగుండు సామాగ్రి వాహనాలు, 155మిమీ యాంటీ ఆర్మర్ మైన్ వ్యవస్థలు 1200, 10 వేల మోర్టార్ రౌండ్లు, జూనీ ఎయిర్‌క్రాప్ట్ రాకెట్లు 4000, యాంటీ ఆర్మర్ రాకెట్లు 200, స్నైఫర్ రైఫిల్స్, మషీన్ గన్స్
హై మొబిలిటీ రాకెట్ వ్యవస్థలు, ఆర్ఐఎమ్ క్షిపణులు వంటివి వున్నాయి.