కేసీఆర్ ఏలుబడిలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మహబూబాబాద్, జనగామలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలతోపాటు ఆస్తులకు గ్యారెంటీ లేదని మండిపడ్డారు. ఎప్పుడు ఏ గ్రామం మీద, ఏ కుటుంబం మీద పడతారో అని బిక్కుబిక్కుమనే జీవనం సాగిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కళ్లు మొదటగా గిరిజనుల మీద పడ్డాయని ఆరోపించారు. 9శాతం రిజర్వేషన్ వస్తే తమ జీవితాలు బాగుపడతాయి అనుకుంటే.. అది చేయకపోగా గిరిజన గూడాల్లో చిచ్చుపెట్టారని మండిపడ్డారు.
గిరిజనుల భూములు లక్కుంటున్నారని.. బోర్లు పూడ్చేస్తున్నారని ఫైరయ్యారు ఈటల. అలాగే బావులను స్వాధీనం చేసుకుంటూ.. కరెంట్ కనెక్షన్లను కూడా తీసివేసే నీచమైన పనికి సీఎం ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని గుర్తు చేశారు. లక్షల ఎకరాల భూముల మీద పేద గిరిజనులు హక్కులు కోల్పోయారని.. వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెడుతోందని అన్నారు.
మహబూబాబాద్ 551 సర్వే నంబర్ లో 40 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన 2వేల ఎకరాల భూములపై ప్రభుత్వం, కొంతమంది రాజకీయ నాయకుల కన్ను పడిందని చెప్పారు ఈటల. మెడికల్ కాలేజీ కట్టవద్దు అని అనడం లేదని.. కానీ పేదలకు నష్టపరిహారం చెల్లించకుండా భూములు ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ప్రజలను సీఎం వేధిస్తున్నారని.. దౌర్జన్యం చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. 2013లో వచ్చిన చట్టం ప్రకారం రైతు నుండి భూమి తీసుకుంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర ఇవ్వాలని.. కానీ.. ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వడం లేదన్నారు.
మెడికల్ కాలేజ్ వస్తుందని తెలుసుకున్న కొంతమంది నాయకులు పక్క ఊరు సర్వే నెంబర్ వేసి 45 ఎకరాల భూమి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించి స్థానిక కార్పొరేటర్ రవి కొట్లాడితే చంపేశారని అన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి టీఆర్‌ఎస్ లో చేరారని.. గులాబీ నాయకుడే అయినా కూడా ఆయన్ను పట్టపగలే చంపారంటే ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయిందని చెప్పారు. 551 సర్వే నెంబర్ లో సాగు చేసుకుంటున్న రైతులందరికీ హక్కులు కల్పించాలని… మెడికల్ కాలేజీకి తీసుకుంటున్న భూమికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. రవి హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
తనపై చిన్న దరఖాస్తు పెడితే ప్రగతి భవన్ నుండి స్పందించిన సీఎం.. రాష్ట్రంలోని ఇతర భూముల వివాదాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఈటల. “ధరణి తెచ్చింది ఈ సీఎం.. చిక్కుముళ్లు వేసింది ఈ సీఎం.. కానీ.. పరిష్కారం మాత్రం చేయరు. కేసీఆర్ అసమర్ధతకు, పేద ప్రజల పట్ల ద్వేషానికి ఇది నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధరణిపై సమీక్షిస్తాం. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. దీనికి కారణం అయిన వారిని శిక్షిస్తాం. రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులకు చెందిన 22 లక్షల ఎకరాల భూములు ధరణి పేరిట వివాదాస్పద భూముల జాబితాలో చేర్చబడ్డాయి. కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ధరణి తెలంగాణ ప్రజల పాలిట శాపం. సీఎం పిచ్చోని చేతిలో రాయిలా పాలన చేస్తున్నారు. ప్రజల కోసమే పుట్టానని అంటున్న కేసీఆర్.. ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలి. ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించాలి. ఇలువుర్తి గ్రామంలో అటవీ శాఖ కొంత భూమి తీసుకొని, వేరేచోట భూమి ఇచ్చారు. దానిని ఇప్పుడు అటవీ శాఖ భూమిగా ధరణిలో పేర్కొన్నారు. భూ ప్రక్షాళన చేస్తాం.. అసైన్డ్ భూములు అన్నీ ఎవరికి ఇచ్చారో వారికే రిజిస్టర్ చేస్తా అని చెప్పిన సీఎం ఆ భూములను ప్రైవేట్ వారికి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం బ్రోకర్ పని చేస్తోంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతూ.. మాఫియాలా వ్యవహరిస్తోంది. సీఎం నచ్చిన వారు.. బంధువులు అయితే సీఎస్ కి చెప్పి ధరణిలో సరి చేస్తున్నారు. సామాన్యుడిని తీవ్ర మనోవేదన పెడుతున్నారు. కేసీఆర్ నీరో చక్రవర్తి” అంటూ విమర్శలు చేశారు ఈటల రాజేందర్.