హైదరాబాద్ : ఈటల రాజేందర్ ఈటెల్లాంటి మాటలు వాడ్డానికి అంత బలమైన రీజనేంటి? తనపై కుట్ర చేస్తున్న వారికి ఇది డైరెక్టుగా ఒక హెచ్చరిక అని అనుకోవాలా.. లేక తనపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు ఇచ్చిన వివరణగా సరిపెట్టుకోవాలా? అసలు ఈటల మాటల వెనుక అంతరార్ధం ఏమిటి? తెలంగాణా ఉద్యమంలోనూ, ఎన్నికల సందర్భంలోనూ మినహా ఈటల ఎప్పుడూ ఎవరి మీదా ఇంతగా మాట్లాడిందే లేదు. మరి ఇంత పరుష పదజాలంతో.. ఉద్వేగభరితంగా ఈటల రాజేందర్ చేసిన ప్రసంగం.. అతని ఆవేశం దేనికి సంకేతం..? ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని తేల్చిచెప్పడానికా.. తన వరకు రావద్దని సొంత పార్టీని నడిపిస్తున్న వారికి పరోక్ష హెచ్చరికా..? తెలంగాణ ఉద్యమం సందర్భంగా తాను చేసిన పోరాటాలు.. వచ్చిన వత్తిళ్లు.. వ్యతిరేకంగా జరిగిన కుట్రలు.. ఇవన్నీ ప్రస్తావించి.. ఈటల తన అభిమానుల్లో ఒక భావోద్వేగాన్ని రేపారు. రానున్న కాలంలో తను చేయబోయే ప్రజా ఉద్యమానికి ఇది ఇప్పటి నుంచే పూరించిన సమర శంఖారావమని అనుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ తీవ్రంగా కలత చెందినట్టుగా కనిపించారు. దొంగలు, మోసగాళ్లు ఒకసారి మోసం చేయవచ్చు గానీ.. ధర్మాన్ని, న్యాయాన్ని ఎవరూ ఎల్లకాలం మోసగించలేరని అన్నారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. ఉద్యమ సమయం నుంచీ టీఆర్ఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ సాయంచేశానే తప్ప.. 15 ఏళ్లలో తాను ఏ ఒక్కరి నుంచీ డబ్బులు తీసుకోలేదని చెప్పారు. ‘కొడుకా తెలుస్తది’ అనే పదజాలం వాడారు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు…? ఎవడు తోయ్యిన తోయో.. ఎవడు హీరోనో తెలుస్తది.. అని కూడా అన్నారు. ఇంతకీ తోయ్యింది ఎవరు.. హీరో ఎవరు…?
తనకు అదిలాబాద్ మొదలు మహబూబ్‌నగర్ వరకు క్యాడర్ ఉంది అని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు ఇది దేనికి సంకేతం…? ఇంతకీ పార్టీలోకి బతకవచ్చింది ఎవరు… ఎవరిని ఉద్దేశించి మంత్రి ఈటెల ఈ కామెంట్స్ చేశారు…?
ఇవన్నీ రేపటి జవాబులు. ఇప్పటికి కేవలం ప్రశ్నలు..