పీకేను అరువు తెచ్చుకున్నా కూడా కేసీఆర్ మొహం చెల్లదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రధాని మోడీ పాలన 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన “ప్రజాసంక్షేమ పాలన సదస్సు”కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ పీకేది నడవదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నడుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని.. కానీ.. ధర్మాన్ని గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రాబల్యం తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా వేలమంది హాజరైతే ఆ సభ ఫెయిల్ అని.. కట్టు కథలు అల్లుతున్నారని మండిపడ్డారు ఈటల. ఈ విషయంలో ప్రభుత్వానికి చెందిన పేపర్, ఛానల్ పెట్టింది పేరని విమర్శించారు. ఇలా విష ప్రచారం చేసే వాటిని వారు తప్ప ఎవరూ చూడరని అన్నారు. ఒకప్పుడు కేసీఆర మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే చీల్చి చెండాడిన యువత ఇప్పుడు ఆయన మొహం చూస్తే ఛీ అంటున్నారని చెప్పారు.
కేసీఆర్ పేరు చెప్తే పొంగిపోయిన తెలంగాణ ఇప్పుడు కుంగి పోతోందన్న ఈటల.. ప్రజలు ఆయన్ను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ‘‘గోగితే లేవని వాడు తంతే లేస్తాడా?.. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడా? అని అప్పట్లో కేసీఆర్ అనేవాడు. ఇప్పుడు ఆయనకి అదే సామెత వర్తిస్తుంది” అని అన్నారు ఈటల. సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోవడంతో.. కేసీఆర్, హరీష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాసేపటికి తిరిగి ప్రసంగించారు ఈటల. ‘‘కరెంటు కష్టం ఇక్కడే మొదలు కాలేదు.. ఎన్నికల సమయంలో ఇదే పని చేశారు. వీళ్ళ సభ సక్సెస్ కావొద్దు అని ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. నేను పాదయాత్ర చేస్తే ఏ ఊరుకు పోయినా రాత్రి కరెంటు తీశారు. చిల్లర చర్యకు గుండె రగిలి ఓట్ల రూపంలో నన్ను గెలిపించారు జనాలు” అని వివరించారు ఈటల.
మొబైల్ ఫోన్.. ఏకే 47 కంటే పదునైన ఆయుధమన్న ఆయన.. సోషల్ మీడియా అంతకంటే పదునైందని తెలిపారు. కేసీఆర్ అప్పుడు ఇచ్చిన హామీలు.. ఇప్పుడు చెప్తున్న అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఒక పార్టీ పెడితే 50-60 ఏళ్లు బతుకుతుంది.. కానీ 8 ఏళ్లకే టీఆర్ఎస్ కి వీఆర్ఎస ఇవ్వడానికి ప్రజలు సిద్దం అయితే అది తప్పించుకోవడానికి కేసీఆర్ బీఆర్ఎస్ అంటున్నారని సెటైర్లు వేశారు. ‘‘మోడీకి దేశ ప్రజలు పిల్లలు, అన్నలు, తల్లులు. ఆయన ప్రధాని పదవి పూర్తి అయితే ఒంటరిగా హిమాలయాల్లో బతుకుతా అన్నారు. లక్షల కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు, కుటుంబానికి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే సందేశం ఇచ్చారు. కానీ.. కేసీఆర్ గోలీలు అందించే వానికి రాజ్యసభ ఇచ్చారు. గోలీలు ఇవ్వడానికే పదవి ఇచ్చా అనడం ఎంత దుర్మార్గం. ఆయనకు ప్రజలకంటే పదవులు, కుటుంబం ఎక్కువ” అని విమర్శించారు.
సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని కించపరిచిన కేసీఆర్.. 4 కోట్లమంది ప్రజలను అవమానించారని అన్నారు. పదవులు అమ్మ అయ్య భిక్ష కాదని.. ప్రజల భిక్ష అని గుర్తు చేశారు. ‘‘నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడడం లేదు.. కేసీఆర్ అన్నవే చెప్తున్నా. పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అని.. కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామ అని..ఏ పథకం ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకుంటారు కేసీఆర్. మోడీ ప్రజా సేవకున్ని అంటే.. కేసీఆర్ అన్నీ నేనే అంటున్నారు. తేడా అర్థం చేసుకోండి. మద్యం మీద 40 వేల కోట్ల ఆదాయం కోసం లక్షలమంది ఆడవారి పుస్తెలు తెంచుతున్నాడు కేసీఆర్. తండ్రి లేని అనాథ పిల్లల ఆర్తనాదాలకు కారణం ఆయన కాదా? పబ్ లలో మైనర్ పిల్లల తాగుడుకు, తాగి పసి పిల్లల మీద లైంగిక దాడులకు కేసీఆర్ ధనదాహమే కారణం. హైదరాబాద్, తెలంగాణలో జరుగుతున్న లైంగిక దాడులకు సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఇదే సంస్కృతి దేశ వ్యాప్తంగా చేయడానికేనా బీఆర్ఎస్. మధ్యాహ్న భోజనానికి డబ్బులు లేవు. తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు. 4.5 లక్షల కోట్ల అప్పు.. బిల్లులతో కలిపితే 5 లక్షల కోట్ల అప్పు. పుట్టే బిడ్డకు 1.6 లక్షల అప్పు ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడ డిబేట్ పెట్టినా వస్తా రెడీనా? 2018 మానిఫెస్టోలో నిరుద్యోగులకు అండగా ఉంటా అని భృతి ఇస్తా అని అమలు చెయ్యలేదు. 58 ఏళ్లకే పెన్షన్ లేదు. ప్రభుత్వాలు పేద వారికి అండగా ఉండాలి కానీ.. కేసీఆర్ అన్నీ పెద్దలకు కట్టబెడుతున్నారు. ఎప్పుడో వదిలిపెట్టిన భూములకు హక్కులు కల్పించడానికి ధరణి తీసుకువచ్చారు” అని ఆరోపించారు ఈటల.