మునుగోడు షెడ్యూల్ రాకతో.. పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో జోరుపెంచాయి. నాంపల్లి మండలం మహ్మదపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పులో తెలంగాణ ఆత్మగౌరవం ఉందని.. కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ తో 20 ఏళ్లు దోస్తానా చేసిన తనను మెడలు పట్టి బయటికి నెట్టారని అన్నారు. 6 నెలలు ఎన్నికలు కొట్లాడానని.. ఈ లోకంలోనే నరకం అనుభవించానని వివరించారు. కేసీఆర్ తో తాను బతకలేదు.. తనతోనే ఆ పార్టీ బతికింది అని హుజూరాబాద్ ఎన్నికతో తేలిపోయిందన్నారు.
హుజూరాబాద్ ఎన్నిక రాగానే కేసీఆర్ బయటికి వచ్చారని.. దళితబంధును తెరపైకి తెచ్చారని చెప్పారు ఈటల. ఇది తన వల్లనే వచ్చిందని.. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నియోజకవర్గంలో లబ్ధి జరుగుతోందని వివరించారు. మునుగోడులో ప్రతి కుటుంబానికీ 10 లక్షల రూపాయలతో “పేదబంధు” ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన బంధు తెలంగాణ అంతా ఇవ్వాలన్నారు. మూడున్నర సంవత్సరాలుగా మర్చిపోయిన పెన్షన్లు.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
‘‘గొల్ల కురుమలు కట్టాల్సిన రూ.41,800 ప్రభుత్వమే చెల్లించి.. రూ.1,75,000 నేరుగా వారికి ఇవ్వాలి. బ్రోకర్లకు ఇవ్వవద్దు. 1500 మంది ఉన్న మహమదపూర్ గ్రామంలో ఒక్క మెడికల్ షాప్ కూడా లేదు కానీ 15 బెల్ట్ షాప్స్ ఉన్నాయి. అంటే 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఉంది. 24 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తున్న కేసీఆర్ మద్యం ద్వారా 42 వేల కోట్లు కొల్లగొడుతున్నారు. తాగి తాగి యువకులు అర్ధాంతరంగా చనిపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు వచ్చాయి కాబట్టి దావత్ లు ఇస్తున్నారని.. ఒక్కరోజు దసరా జరుపుకుంటే కేసీఆర్ ఈ నెల రోజుల పాటు జరిపిస్తారని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేలు స్వయంగా మందుపోస్తారు.. యువకులు బానిసకాకండని సూచించారు. హుజూరాబాద్ లో తాగుడు అలవాటు లేని యువకులకు కూడా 6 నెలల పాటు మందు పోసి పోసి వారి జీవితాలను టీఆర్ఎస్ నేతలు పాడు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ, ధర్మానికి ఓటు వేయండని కోరారు ఈటల రాజేందర్.