హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ కు మతి తప్పిందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందన్నారు.
ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తుందన్న కేసీఆర్.. ఏం చేశారని ప్రశ్నించారు ఈటల. కేసీఆర్ వచ్చిన తరువాత కూడా నీళ్ళు రాని మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ” నేను సవాల్ చేస్తున్నా ఎక్కడైనా చర్చకు సిద్ధం.. వస్తావా కేసీఆర్” అంటూ ఛాలెంజ్ చేశారు.
రైతబంధు ఇచ్చేది పంటలు వేయడానికా? లేక వేయొద్దనా? అని ప్రశ్నించారు రాజేందర్. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వేలాది మంది రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందని ఆరోపించారు. కనీసం దీనిపైన అయినా కేసీఆర్ సమాధానం చెప్తారా? అని నిలదీశారు.
రైతుల కంట కన్నళ్లు పెట్టించిన కేసీఆర్ ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుందన్నారు ఈటల. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పాతరేయడం ఖాయం కాబట్టే కేటీఆర్ ఇష్టం వచ్చి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని.. కాషాయ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.