– కొండగట్టు ప్రమాద బాధితులకు సాయం అందలేదు
– ధాన్యం కొనుగోళ్ల దగ్గర రైతుల అవస్థలు ఆగలేదు
– కేసీఆర్ మాత్రం డబ్బులు పంజాబ్ లో పంచుతారు..
– ఆయన ఉంది మన కోసమా? మంది కోసమా?
– ఇక్కడి ప్రజల సమస్యలు కనిపించడం లేదా?
– సీఎంను నిలదీసిన ఈటల
హుజూరాబాద్ తీర్పు రాష్ట్రమంతా పునరావృతం అవుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. యాదాద్రి భువనగిరి జిల్లాతుర్కపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల్లోని పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. కేసీఆర్ ను గద్దె దించడమే మనందరి పంతమని చెప్పారు ఈటల. కొండగట్టు బస్సు ప్రమాదంలో 67 మంది చనిపోతే.. ఇప్పటికీ సాయం అందలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే దిక్కులేదు గానీ.. మన సొమ్ము తీసుకువెళ్ళి పంజాబ్ లో కేసీఆర్ పంచిపెట్టారని ఫైరయ్యారు. ఆయన ఉంది మన కొసమా? మంది కోసమా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇక్కడి ప్రజలు కనిపించడం లేదా? లోకల్ సమస్యలు పట్టించుకోకుండా.. ఎక్కడో ఎలగబెడతానని పోవడం ఏంటని నిలదీశారు. కేసీఆర్ ఎన్నికల కోసం రూ.15 వేల కోట్లు పక్కకు తీసి పెట్టుకున్నారని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచి, మద్యం తాగించి ఓట్లు అడుగుతారని.. ఆయన ఇచ్చేవి ఇంట్లో నుండి తెచ్చి ఇవ్వడంలేదన్నారు. కేసీఆర్ ఎంత పంచినా తీసుకుని.. బీజేపీకి ఓటు వేయాలన్నారు ఈటల. కాంగ్రెస్ కు ఓటేసినా అది టీఆర్‌ఎస్ కు వేసినట్లే అవుతుందని చెప్పారు.
బీజేపీ మాత్రమే కేసీఆర్ తో బరిగీసి కొట్లాడుతుందని అన్నారు. బీజేపీకి అధికారం కనుచూపుమేరలో ఉందన్న ఆయన.. రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. తుర్కపల్లి తాగునీటికి అల్లాడుతోందని వివరించారు. “తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వలసలు ఆగిపోతాయి అనుకున్నాం. జెండాలు పక్కనబెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో కేసీఆర్, ఆయన కుటుంబం బాగుపడింది తప్ప.. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఇక్కడికి వస్తాయని సంతోషపడుతుంటే… కేసీఆర్ పంటలు వేయవద్దు అని హుకుం జారీ చేశారు. దేశంలో ఎక్కడా ఇలా లేదు. పంటలు వేయకుండా ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టారు సీఎం. పండిన పంట అమ్ముకోవడానికి లేదు. క్వింటాల్ కి 10 కేజీలు కోత పెడుతున్నారు. మిల్లుకు పంపితే వారం రోజులపాటు కూడా దిగుమతి కావడం లేదు” అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, పెన్షన్ ఇస్తున్నారని అనుకోవచ్చు.. కానీ.. మన డబ్బులు మనకే ఇస్తున్నారని తెలిపారు ఈటల. లిక్కర్ ఛార్జీలు పెంచి.. మద్యం అమ్మి సంపాదిస్తున్నారని చెప్పారు. మద్యం మీద సంపాదిస్తున్న రూ.40 వేల కోట్ల వెనుక అనేకమంది తల్లుల తెగిన పుస్తెలు ఉన్నాయన్నారు. 6.80 లక్షల మంది తెలంగాణలో తాగుడికి బానిసయ్యారని ఓ సర్వే చెబుతోందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి తప్పి యువత కళ్ళలో మట్టి కొట్టారని కేసీఆర్ పై ఫైరయ్యారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని.. 60 ఏళ్లు నిండిన వారికే ఇవ్వడం లేదని విమర్శించారు ఈటల రాజేందర్.