తాగుబోతులను తయారు చేయడంలో రాష్ట్రం నెంబర్ వన్ గా మారిందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్ లో బీసీ చైతన్య సదస్సు జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తోపాటు ఈటల హాజరయ్యారు. ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయమని చెప్పారు. వారందరి కోసమే తన ఆరాటమని చెప్పిన కేసీఆర్.. ఏం చేశారని ప్రశ్నించారు. తాగుబోతులను తయారు చేస్తున్నారని ఆరోపించారు.
నిజాం కాలం నాటి భూములు అమ్ముకొని కేసీఆర్ సోకులు చేసుకుంటున్నారని విమర్శించారు ఈటల. ఆనాడు రూ.10 వేల కోట్లు లేని లిక్కర్ ఆదాయం.. ఇప్పుడు రూ.31 వేల కోట్లకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అడబిడ్డల మాంగల్యాలను దూరం చేస్తున్నారని.. లక్షల మంది పిల్లలను ఆనాధలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. 52 శాతం ఉన్న బీసీలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్తారా? అని నిలదీశారు. నిధుల కేటాయింపు ఉంటుంది కానీ.. ఖర్చు చేయడానికి చేతులు రావని ఫైరయ్యారు.
కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని.. దాన్ని ప్రజలు గ్రహించారని చెప్పారు రాజేందర్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయమన్నారు. పీకేని సిద్దిపేటలో దింపితే ఓట్లు వస్తాయా? హుజూరాబాద్ లో ఆయన వ్యూహాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తనను ఓడించేందుకు రూ.600 కోట్లు, మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. ఓటుకి 10 వేలు ఇచ్చారని.. ఆ దుర్మార్గాలలకు హరీష్ రావు నాయకత్వం వహించారని చెప్పారు.
రాజకీయాలను డబ్బుతో కలుషితం చేసి సాధారణ ప్రజలకు, సామాన్యునికి పదవులను దూరం చేసిన దుర్మార్గులు టీఆర్‌ఎస్ నేతలని విమర్శించారు. దేశంలోనే వేల కోట్లు పంచి ప్రజాతీర్పును వంచించేందుకు గులాబీ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ధర్మం, న్యాయం నిజమే అయితే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. 24 గంటల కరెంట్ నిజమే అయితే.. రాత్రి పూట బావుల దగ్గర ఉంటుందా? అని ప్రశ్నించారు. అసలు.. 24 గంటల కరెంట్ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. రూ.10 లక్షల దళితబంధు ఎక్కడికి పోయిందని అడిగారు. వందో, రెండు వందల మందికో ఇస్తుండొచ్చు.. మిగితావారి కండ్లలో కారం కొడతారని జోస్యం చెప్పారు.
తెలంగాణ ప్రజలు ఏదీ మర్చిపోరని.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు ఈటల. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ డబ్బు సంచులు గుంజుకోవాల్సిందే.. ఓటు మాత్రం ధర్మానికి వేయాల్సిందేని అన్నారు. బీజేపీలో అతి సాధారణ వ్యక్తికి కూడా ఉన్నత పదవులు వస్తాయని అదే.. టీఆర్‌ఎస్ లో మరో వ్యక్తి ఎదుగుతుంటే కేసీఆర్ అణచివేస్తారని ఆరోపించారు. తెలంగాణ పల్లెల్లో అశాంతి కనిపిస్తోందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలితేనే శాంతి నెలకొంటుందని చెప్పారు ఈటల రాజేందర్.