ఎన్ని కేసులైనా పెట్టుకో.. బీజేపీ భయపడదని కేసీఆర్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ అరెస్ట్ పై హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం, కరీంనగర్ సీపీపై మండిపడ్డారు. కోవిడ్ నిబంధనలకు లోబడి సంజయ్ తన కార్యాలయంలో దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నారా? లేక.. కేసీఆర్ ఆదేశాలతో పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తారా? కార్యకర్తలను, మీడియా ప్రతినిధులను కొడతారా? ఇది ఎంతవరకు కరెక్టని మండిపడ్డారు.
బీజేపీ దేనికీ భయపడదన్న ఈటల.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బెంగాల్ ఫార్ములా అమలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఇది తెలంగాణ గడ్డ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. శత్రు సైన్యాల మధ్య ఘర్షణలా కరీంనగర్ సీపీ వ్యవహరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికలో ఓటమి తర్వాత కేసీఆర్ ఆగం అవుతున్నారని.. ఆయన కాళ్ల కింద భూమి కదులుతోందని భయపడుతున్నారని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు రాజేందర్. సీఎం ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. ప్రగతి భవన్ కి ఇనుప కంచెలు, ఫాంహౌస్ కి పెద్ద గోడలు కట్టుకుని ఉంటున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినడం లేదన్న ఆయన.. నిర్బంధంతో ఏం సాధించలేరని చురకలంటించారు. నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను ఉద్యోగ సంఘాలు కలవాలన్నారు ఈటల.