ఏ క్షణంలో అయినా మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని మునుగోడు ప్రజలు వేచిచూస్తున్నారని చెప్పారు. మూడున్నర సంవత్సరాల నుండి రాజగోపాల్ మునుగోడు గురించి అసెంబ్లీలో అడిగి అడిగి అలిసిపోయారని అన్నారు.
ఉపఎన్నిక జరిగితేనే సీఎం నిధులు ఇస్తాడని తేలిపోయింది కాబట్టి అభివృద్ధి కోసం రాజీనామా చేశారని తెలిపారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయవద్దు అని విశ్వప్రయత్నాలు చేశారని.. అక్కడ దళితులు ఎక్కువమంది ఉన్నారు అని దళితబంధు ఇచ్చారని గుర్తు చేశారు. మునుగోడులో కూడా అన్నీ రావాలంటే రాజీనామా చేయాలని రాజగోపాల్ కు చెప్పానని తెలిపారు. ఆయన రాజీనామా దెబ్బకు 57 ఏళ్ల వారందరికీ పెన్షన్ వచ్చిందన్నారు. అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కూడా రాజగోపాల్ పుణ్యమేనని వివరించారు.
ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ తన పరిధిలో లేదు అని మాయమాటలు చెప్పారని.. మరి ఇప్పుడు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 33 తండాల్లో ఉన్న ఓట్ల కోసమో.. లేదా మళ్లీ మోసం చేయడానికో ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే గిరిజన బంధు అంటున్నారని.. 57 ఏళ్ల పెన్షన్ తీసుకొనేవారు, గిరిజన విద్యార్థులు, గిరిజన కుటుంబాలు రాజగోపాల్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలన్నారు.
దసరా దావత్ లు మొదలుపెట్టారని… పండగకు మీరు వంట చేసుకొనవసరం లేదని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఉన్న ప్రతి ఇంటికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల. అలాగే గిరిజన బంధు తెలంగాణలో ప్రతీ కుటుంబానికి ఇవ్వాలన్నారు. పేదరికానికి కులం, మతంతో సంబంధం లేదు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతీ పేద కుటుంబానికి “పేదబంధు” ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజేందర్.