దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ లోని క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు రావడానికి కారణం తానేనని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు. హుజూరాబాద్ బైపోల్ లో మంత్రులు ఇచ్చిన హామీల అడ్రస్ ఎక్కడో చెప్పాలని సెటైర్లు వేశారు.
ఉప ఎన్నికలో దళితుల ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు ఈటల. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమ ఉండదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక లేకుంటే దళిత బంధు ఉండేదే కాదన్న ఆయన.. తన రాజీనామాతో కేసీఆర్ దిగివచ్చారని చెప్పారు.
సంవత్సర కాలంలో దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు రాజేందర్. 10 లక్షల స్కీమ్ లో దళితులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని చెప్పారు. ప్రజలు కడుతున్న పన్నులతోనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. అర్హులైన పేద వాళ్లకే డబుల్ బెడ్రూం ఇవ్వాలన్నారు. బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు..
అధికారులు చట్టాలకు లోబడి పని చేయాలని చెప్పారు ఈటల. పేదల పక్షాన కొట్లాడడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని… కరీంనగర్ పాల డైరీ యాజమాన్యం రెండేసి గేదెల కోసం డబ్బులు కట్టించుకొని నేటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఊరురా బెల్టు షాపులు పెట్టి ఎన్నో కుటుంబాల బతుకులు రోడ్డు మీద పడేస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు రాజేందర్. సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని విమర్శించారు.