గవర్నర్ తమిళిసై మేడారం పర్యటనలో మంత్రులు, అధికారులు గౌర్హాజరుపై వివాదం చెలరేగుతోంది. బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం? అని ప్రశ్నించారు. మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను అవమానించిన కేసీఆర్.. తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఈ ఇష్యూపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మేడారంలో గవర్నర్ ను అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ సంస్కారహీనమైన సంప్రదాయానికి తెర తీశారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో దీన్నిబట్టే అర్థం అవుతోందని విమర్శించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు.
ఎన్డీఏ, యూపీఏ మినహా మరే ఇతర కూటమి దేశంలో రాణించలేదని అభిప్రాయపడ్డారు రాజేందర్. ఉద్యోగాలు వచ్చిన వాళ్లు.. రాని వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రాష్ట్రంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారనే అహంకారంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్ వి చిల్లర వ్యాఖ్యలు అని మండిపడ్డారు ఈటల. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని.. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని గుర్తుచేస్తున్నామన్నారు.
ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబై పర్యటన అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు ఈటల. జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నించారు.. విఫలమయ్యారని ఎద్దేవ చేశారు. ప్రజలెవరూ కేసీఆర్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని ఆరోపించారు ఈటల.