మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంపై బీజేపీ స్పందించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో స్కూళ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. బాసర ఐఐటీలో విద్యార్థులు మూడు నెలలు ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సిబ్బంది లేరన్న ఆయన.. భవనాలకు కిరాయి కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతులు కూడా సరిగ్గా ఉండడం లేదని.. సరూర్ నగర్ లో అనాధ పిల్లలు చదివే స్కూల్ లో ఒకటే టాయిలెట్ ఉందని వివరించారు. అక్కడ పిల్లలు రాత్రి పూట బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొందన్నారు. అన్ని రంగాల్లో ఫస్ట్ ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన ఊరు-మన బడితో రంగుల కల చూపిస్తున్నారన్నారు.
ఆరోగ్య శ్రీ కింద ట్రీట్ మెంట్ చేయలేమని ప్రైవేట్ ఆస్పత్రులు చెబుతున్నాయని.. వాటికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు ఈటల. కాంట్రాక్టర్లకు రెండు, మూడేళ్లయినా డబ్బులు రావడం లేదని.. అభివృద్ధి పేరుతో మాయ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 45వేల కోట్లు రాబడుతున్నారని.. జనాన్ని తాగుడుకు బానిసలు చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన షాపులు లిక్కర్ షాపులని.. కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన ఏడాదికి వస్తోందని మండిపడ్డారు. పథకాలకు కేటాయిస్తున్న డబ్బులు త్వరగా కేటాయించాలని డిమాండ్ చేశారు. చెప్పేది గొప్పగా.. చేసేది సున్నాగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. గొప్ప దార్శనికత అని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆచరణలో చేసి చూపించాలని అన్నారు ఈటల రాజేందర్