సీఎం కేసీఆర్ మాటలకు.. చేతలకు సంబంధం ఉండదన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. భారత రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంటలో భీమ్ దీక్ష నిర్వహించారు ఈటల. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించారని.. రాజ్యాంగాన్ని కించపరిచారని మండిపడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా, గౌరవంగా ఉండాలని అన్నారు. కానీ.. కంచె చేను మేసినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సీఎం, ఆయన్ను సమర్ధిస్తున్న అనుచరులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈటల. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్.. ఆ పదవినే అవమానిస్తున్నారని మండిపడ్డారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇచ్చిన తీర్పే రేపు తెలంగాణ ప్రజలందరూ ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు రాజేందర్. ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఖతం పట్టించాలని కుట్రపూరితంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించి.. ఎన్నికల ముందు పది లక్షలు అకౌంట్ లో వేసి పాసు పుస్తకాలు ఇచ్చి ఎవరో అడ్డుకున్నారు అని నాటకాలు ఆడారని విమర్శించారు.