మాటలే తప్ప.. ఆచరణ లేని ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఈటల రాజేందర్ ఆరోపించారు. నారాయణపేటలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్…రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరని ప్రశ్నించారు. సీఎం సీట్లో కూర్చొని చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవ చేశారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై సీఎం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లు పండించొద్దని చెప్పి.. దాన్ని కేంద్రం మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక క్వింటా వడ్లకు 10కిలోల తరుగు తీస్తున్నారని.. దాంట్లో సీఎం వాటా ఎంత అని ప్రశ్నించారు. దేశంలో ఉప్పుడు బియ్యం కొనే పరిస్థితులు లేవని రెండున్నర సంవత్సరాల నుండి ప్రత్యుత్తరాలు నడుస్తుంటే.. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు వద్దు అనడానికి కారణాలు ఏంటని మండిపడ్డారు ఈటల రాజేందర్.