రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ అవమానించారని అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మనది ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని.. అలాంటి దాన్ని తీసివేయాలంటారా? అంటూ మండిపడ్డారు. భారత రాజ్యాంగం.. చాయ్ వాలా కూడా ప్రధాని కావొచ్చని, దళితుడు రాష్ట్రపతి అవ్వొచ్చని చెప్పిందన్నారు. దోపిడీకి ఆస్కారం లేకుండా.. బందు ప్రీతి లేకుండా సమతని పంచిందని గుర్తు చేశారు. అలాంటి దాన్ని మర్చేయాలని అనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ద్వారా వచ్చిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు ఈటల.
రాజ్యాంగం సాక్షిగా సీఎం అయిన కేసీఆర్ భాష అవమానకరంగా, జుగుప్సాకరంగా ఉందని చెప్పారు.
దరిద్రపు మొఖాలు..
మందికి పుట్టిన వారిని ముద్దాడిన వాళ్ళు..
మెంటల్ గాళ్లు..
దిమాగ్ కారాబ్ అయిన వాళ్లని మాట్లాడారు.. అవన్నీ కూడా కేసీఆర్ కు వర్తిస్తాయని సెటైర్లు వేశారు రాజేందర్. అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు తాను, ఆ తర్వాత కొడుకు, మనుమడు రావాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా చేశారన్న ఈటల.. మీడియా, పత్రికలను కేసీఆర్ చేతుల్లో పెట్టుకున్నారని ఆరోపించారు.
కూట్ల రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నాడంట.. దేశంలో ఉన్న ఐఏఎస్ లతో మీటింగ్ పెడతా అని అంటున్నారు.. ఒక ఆకునూరు మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆత్మను చంపుకోలేక బయిటికి పోయిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు ఈటల. సీఎం ఆఫీస్ లో ఒక్క ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ ఉండాలని తాను అడిగేదాకా దిక్కు లేదని గుర్తు చేశారు. ఆఫీసర్స్ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలిగా అంటూ ప్రశ్నించారు.
ప్రపంచంలో అత్యధిక మెంబర్ షిప్ ఉన్నది బీజేపీకేనని.. కేసీఆర్ ఏం చేయలేరని అన్నారు ఈటల. భారత రాజ్యాంగం తీసి కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అని మండిపడ్డారు. ఇన్నేళ్లలో కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇవ్వట్లే.. దళిత బంధు ఏమైంది.. అవన్నీ ఓట్ల కోసమే ప్రకటిస్తారు తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. తెలంగాణ సమాజం కేసీఆర్ పై భగ్గుమంటోందన్న ఈటల.. బదిలీలు చేస్తే ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. సీఎం సంస్కార హీనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాజేందర్.