కేసీఆర్ అహంకారాన్ని దించడానికి ప్రజాస్వామికంగానే కొట్లాడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పుర్ గుట్ట బుగుల్ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయాలని ఎవరు కుట్ర చెయ్యరని.. బీజేపీ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అదే ప్రజలు తలుచుకుంటే మాత్రం పార్టీలు కనుమరుగు అవుతాయని అన్నారు.
కేసీఆర్ కూడా టీడీపీ, కాంగ్రెస్ లను మాయం చేయాలని చూశారని ఆరోపించారు ఈటల. తనకు ఎదురులేకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశారని.. కానీ ప్రజలే ఎవరికి వారు కేసీఆర్ ను ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నారని విమర్శలు చేశారు. ప్రాంతీయ పార్టీ ముసుగులో కుటుంబ పాలన చేసినా, సొంత జాగీరులా భావించి ప్రజా ధనాన్ని వృధా చేసినా.. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సింది పోయి వేధింపులకు గురి చేసినా ప్రజలు పాతరేస్తారని మండిపడ్డారు.
హుజూరాబాద్ ఎన్నికను దేశమంతా చూశారన్నారు ఈటల రాజేందర్. ప్రభుత్వం ఇక్కడి వారిని వేధించిన తీరును గమనించారని.. దానిని ఎదుర్కొనేందుకు మానవ ప్రయత్నం చేస్తూనే, దేవుళ్ళను కూడా కేసీఆర్ అహంకారం ఒడిపోవాలి అని మొక్కుకుంటున్నారని చెప్పుకొచ్చారు.