తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిన్న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రధాని విజయ సంకల్ప సభ దిగ్విజయం అయిందని హర్షం వ్యక్తం చేసారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రధాని బహిరంగ సభకు బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఈటల విమర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలో.. జాతీయ పార్టీలో ఉండే తేడాను గమనించానని ఈటల రాజేందర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయని.. జాతీయ పార్టీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుందని తెలిపారు.
బిజెపి సభకు యువతలో చైతన్యం స్పష్టంగా కనిపించిందని రాజేందర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీడియాలో బిజెపికి సంబంధించి వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగిందని ఫైరయ్యారు. టీఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బిజెపి అధిష్టానం ఆదేశించిందని ఈటల సవాల్ విసిరారు.