- గిరిజన మహిళలపై కేసీఆర్ సర్కారు దాడులకు పాల్పడుతోందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఓవైపు బిజెపి ప్రభుత్వం ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవిని కట్టబెట్టి తగిన గౌరవమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన మహిళలపై చేయి చేసుకుంటోందని ఫైరయ్యారు. గిరిజనుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యించుకునేలా ఉందన్నారు. సీఎం కేసీఆర్.. తన 8 ఏళ్ల పాలనలో ఒక ఎకరం అసైన్డ్ భూమినీ పంచలేదని విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసి.. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల విషయంలో దళితులకు బిజెపి అండగా ఉంటుందన్నారు. సీఎం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానవీయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరిస్తూ,.. అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు ఈటల. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న లక్షల ఎకరాలపై కేసీఆర్ సర్కారు కన్నుపడిందన్న ఆయన..ప్రభుత్వం అవసరాలకు కాకుండా ప్రైవేటు వారికి ఈ భూములు లాక్కుని పెద్దలకు కట్టబెడుతోందంటూ ఆరోపించారు. పేదలను బెదిరించి వారి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు.