– టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే
– ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిందేంటి?
– పల్లెలు వల్లకాడులా మారాయి
– అన్ని వర్గాలు మోసం పోయాయి
– టీఆర్ఎస్ పాలనపై ఈటల ఫైర్
బంగారు తెలంగాణ అంటే గిరిజనుల కళ్లల్లో మట్టి కొట్టడమేనా..? వారి బతుకుల్లో మంటలు రేపడమేనా అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణ వస్తే పోడుభూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఎనిమిదేండ్లు గడిచినా నెరవేర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైరయ్యారు. అధికారం ఇస్తే.. గిరిజనులకు రిజర్వేషన్లు వస్తాయి అని.. పోడు భూములకు పట్టాలు వస్తాయని మాయమాటలు చెప్పి.. చివరకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అందుకు సజీవ సాక్షం గుర్రంబోడు తండానేనని గుర్తుచేశారు.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతోమంది ఉద్యమించి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ.. బీఆర్ఎస్ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా గిరిజనులు, దళితులు, పేద ప్రజల బతుకులు ఏం మారలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పల్లెలు వల్లకాడు అయ్యాయని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల చొప్పున భూములిస్తానని.. ఉన్న భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. దళితుల బతుకులు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
ధరణి పోర్టల్ లో సమస్యలకు పరిష్కారం చూపగలిగేది బీజేపీనేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. 12 లక్షల మంది రైతులకు చెందిన 22 లక్షల ఎకరాల భూమిలో కేసీఆర్ ధరణి పేరుతో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఎక్కాక బోడ మల్లన్న అనేది కేసీఆర్ వైఖరి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ రెండూ ఒకేగూటి పక్షులని, ప్రజలు ఇప్పటికైనా ఆ నాటకాన్ని తెలుసుకోవాలన్నారు. ఏదేమైనా తెలంగాణలో ఎగిరేది కాషాయజెండానేనని భరోసా వ్యక్తం చేశారు.