పోలీస్ రిక్రూట్ మెంట్ లో అన్యాయం జరుగుతోందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కొందరు అభ్యర్థులు ఆయన్ను కలిసి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ కొలువుదీరి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటిపోయిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు నింపుతానని మాట ఇచ్చిన కేసీఆర్.. కొన్ని ఉద్యోగాలు నింపి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
ఈ మధ్యకాలంలో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఉందన్నారు ఈటల. వివిధ కారణాలు చూపి ఉద్యోగ భర్తీలు కావడం లేదని.. జెఎల్ఎం ఉద్యోగాలలో మాస్ కాపీ జరిగిందని రద్దు చేశారని.. సింగరేణి ఉద్యోగాలను కూడా అలానే చేశారని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు తాటికాయ అంత అక్షరాలతో ఇచ్చి నియామకాలు మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. ఎస్సై, కానిస్టేబుల్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉన్న కానిస్టేబుల్ కి.. యూనిఫాం సర్వీస్ లో ఉన్న ఉద్యోగాలకు అన్నింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
కానిస్టేబుల్ ను గతంలో ఎక్సైజ్ లో.. ఫారెస్ట్ లో వేరువేరు హైట్ ఉన్నవారిని సెలెక్ట్ చేసేవాళ్ళని గుర్తు చేశారు రాజేందర్. కానీ వీటన్నింటినీ కలిపేసి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. చదువుకున్నవాడికి ఉద్యోగం రావద్దు అన్నట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. దేశంలో లాంగ్ జంప్ 3.8 మీటర్లకు ఎంపిక చేస్తుంటే. తెలంగాణలో మాత్రం 4 మీటర్లు పెట్టారన్నారు. దీనివల్ల లక్షమంది డిస్ క్వాలిఫై అయ్యారని చెప్పారు. న్యాయం చేయమని మంత్రుల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని.. ఎవరూ భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా కూడా నీరో చక్రవర్తి లాగా ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు ఈటల. ఉద్యోగాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అమ్మానాన్న పంపించిన మూడు, నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని లైబ్రరీ కుర్చీల్లో కూర్చొని చదువుతుంటే.. వాళ్లకు ఉద్యోగం అందని ద్రాక్షలాగా చేస్తున్నారని మండిపడ్డారు. రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావుకి వీరి బాధలు కనిపించడం లేదా? అని అడిగారు. గతంలో ఐదు ఈవెంట్లలో మూడు సెలెక్ట్ అయితే సరిపోయేదని.. కానీ ఇప్పుడు మూడు పెట్టి ఒకటి ఎంపిక కాకపోయినా డిస్క్ క్వాలిఫై చేయడం సరికాదన్నారు.
రన్నింగ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్దులు ప్రతి ఒక్కరినీ ఫైనల్ ఎగ్జామ్ కి అనుమతించాలని డిమాండ్ చేశారు రాజేందర్. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి సంబంధించి 165 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవారికి అవకాశం కల్పించాలన్నారు. కొత్తవి అన్నీ తీసివేసి పాత నిబంధనల ప్రకటమే ఎంపిక చేయాలని.. ఓపెన్ గా మాస్క్ ఇన్ పెయిన్ జరుగుతున్న విధానాన్ని అరికట్టాలని సూచించారు. ఇంత దుర్మార్గమైన దరిద్రమైన సిస్టం ఎక్కడా లేదన్న ఆయన.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చటం కోసం.. విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టడం కోసం నోటిఫికేషన్లు ఇస్తోందని ఫైరయ్యారు ఈటల రాజేందర్.