సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపై వివాదం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. అయితే.. ఇదే సమయంలో సింగరేణి ప్రైవేటీకరణపైనా చర్చ జరుగుతుంటుంది. కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ స్పందించారు.
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే6 గనిపై నిర్వహించిన బీఎమ్ఎస్ కార్మిక చైతన్య యాత్ర మీటింగ్ లో ఈటల పాల్గొన్నారు. కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
సామర్థ్యం పెరిగితే ఉద్యోగాలు పెరగాలని.. ఇక్కడ తగ్గిపోతున్నారని అన్నారు రాజేందర్. దీన్నిబట్టే కేసీఆర్ కు సంస్థ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని ఎద్దేవ చేసారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని పునరుద్ఘాటించారు. గులాబీ నేతలు చేస్తున్న విష ప్రచారం తప్పని.. దీనిపై బహిరంగ చర్చకైనా సిద్ధమన్నారు.
సింగరేణిని ముఖ్యమంత్రి తన కుటుంబ ఆస్తిగా మారుస్తున్నారని ఆరోపించారు ఈటల. ఇక్కడ వారి ఆధిపత్యం కొనసాగిస్తున్నారని… కవితకు సింగరేణిని అప్పగించారని అన్నారు. ఆమె చెప్తేనే సీఎండీ స్పందిస్తున్న పరిస్థితి ఉందని విమర్శించారు. సింగరేణిలో రాష్ట్ర వాటా 51 శాతం అయితే.. కేంద్రం వాటా 49 శాతమని తెలిపారు. అయినా కూడా ఏనాడూ కేంద్రం సింగరేణిలో జోక్యం కలిగించుకొలేదన్నారు.
ఇక ఇదే కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. కేసీఆర్ సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. అసలు.. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తోందే కేసీఆర్ అని విమర్శించారు.